Read more!

ప్రస్తుత సమాజంలో భక్తికి ఉన్న స్థానమేమిటి.. భక్తి ఎందుకు అవసరం!

 

ప్రస్తుత సమాజంలో భక్తికి ఉన్న స్థానమేమిటి.. భక్తి ఎందుకు అవసరం!

ప్రతి మనిషికీ తమ తమ మతాల ప్రాతిపదికన దేవుడి మీద భక్తి ఉంటుంది.  సర్వకాల సర్వావస్థల్లోనూ మనిషి భగవంతునిపై భక్తివిశ్వాసాలు కలిగి ఉండాలి. దానికి అనుకూలమైన, ప్రతికూలమైన శక్తులు కూడా అన్ని కాలాల్లోనూ, అన్నిచోట్లా ఉంటాయి. కొంతమంది భావిస్తున్నట్లుగా, భక్తిని వ్యతిరేకించే శక్తులు ఉండడమనేది కేవలం మన కాలంనాటి ప్రత్యేకత ఏమీ కాదు. కానీ దీనిలో కొంత నిజం కూడా లేకపోలేదు. పాండిత్యంతో కూడిన వాదోపవివాదాలు కొందరిని సంశయాలకి గురిచేస్తాయి. అయితే పాండిత్యం కంటే కూడా విషయ సుఖాల పట్ల ఒక వ్యక్తికి గల తీవ్ర ఆకర్షణ అతడిలో సందేహాలు కలగ చేస్తుంది. భగవంతునిపై విశ్వాసానికి సంబంధించినంత వరకూ పాండిత్యం సాధారణంగా తటస్థంగానే ఉంటుంది. విశ్వాసం పేరుతో ప్రారంభమైన వివిధ అనాగరక మూఢ నమ్మకాలను అది ప్రశ్నించి నాశనం చేస్తుంది. అలా బూజు దులపడం కూడా చాలా యుక్తమైన పద్ధతే. సృష్టియొక్క అసలు  తత్త్వాన్ని గురించి తమకేమీ తెలియదని పండితులకు కూడా తెలుసు. 

విజ్ఞాన శాస్త్రపు ఆధునిక తత్త్వ వేత్తలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. మానవులు తమ జీవితాల నుంచి భక్తిని ఎంతగా దూరం చేసుకుంటారో ఈ అనంత విశ్వంలో తాము నిరర్థకమైన జీవులుగా మిగిలినట్లు గ్రహిస్తారు. వారి దైనందిన జీవితంలో నైతికత దూరమౌతుంది. నీతి నియమాలు లేని మానవ సమాజం పశుప్రాయమైంది. ఎందుకంటే జంతువులకు సంబంధించినంతవరకూ, వాటి బుద్ధిని మార్చడం ఏమాత్రం వీలుకాదు. కానీ మానవుని విషయంలో బుద్ధిని నియంత్రించే శక్తులన్నీ అతని అధీనంలోనే ఉంటాయి. మనిషి తన జీవితానికి ఏదో ఒక పరమార్థాన్ని ఆపాదించనంత వరకు అతని చింతనాసరళి దుర్బలంగానూ, గందరగోళం గానూ తయారై, జీవితం చుక్కానిలేని నావలా మారుతుంది.

జీవితంలో మనిషి సుఖ శాంతులతో ఉండాలంటే భగవంతునిపై భక్తివిశ్వాసాలు కలిగి ఉండడం అవసరం. మానవ చరిత్రలో  ఇంతకు పూర్వం జరిగిన విషయాల కంటే ఇప్పుడు భక్తివిశ్వాసాలు అవసరం. ఎందుకంటే భక్తి లేనినాడు మనిషి మరింత అవినీతి పరుడిగా మారి దుఃఖాలను అనుభవించి వలసి వస్తుంది.

                                    ◆నిశ్శబ్ద.